👉కరెంటు లేదు.. ఆహారం, ఫోన్ల ఛార్జింగ్ కోసం బారులు
వెనిజులా ప్రజల కష్టాలు…
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. వెనిజులాపై అమెరికా ఒక్కసారిగా మెరుపుదాడులకు పాల్పడింది ఈ దాడులతో ఆ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వైమానిక దాడుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినడంతో కారకాస్‌లోని అనేక ప్రాంతాల్లో కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లు మూతపడటంతో.. చిన్న దుకాణాల వద్ద ప్రజలు ఆహారం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కారకాస్‌లోని భారతీయుడు సునీల్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరించారు ‘భారీ నష్టం జరిగింది. కారకాస్‌లోని విమానాశ్రయంపై కూడా అమెరికా దాడి చేసింది. నగరానికి 100 కి.మీల దూరంలో ఓ వైమానిక స్థావరం ఉంది. దేశంలోనే అతిపెద్దది. అది కూడా దెబ్బతింది. ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ స్థావరం వద్ద ఎక్కువ నష్టం జరిగింది. దాడి అనంతరం అన్ని సూపర్ మార్కెట్లు మూసేశారు.చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు పొడవైన క్యూలు కన్పిస్తున్నాయి.
ప్రతి చోటా 500- 600 మంది బారులు తీరారు. ఫార్మసీల వద్ద చాలా పెద్ద క్యూలు కన్పిస్తున్నాయి’ అని ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు కూడా రావడం లేదన్నారు. కరెంటు లేకపోవడంతో ఫోన్ల ఛార్జింగ్‌కు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ దీపాల వద్ద కరెంటు ఉండటంతో.. దాని నుంచి ప్రజలు ఫోన్‌లకు చార్జింగ్ పెట్టుకుంటున్నారని వెల్లడించారు. తన ఫోన్‌ను చార్జి చేసుకోవడం కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని మల్హోత్రా తెలిపారు. కరెంటు సమస్య ఎప్పుడు తీరుతుందనే దానిపై స్థానిక యంత్రాంగం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదన్నారు. ఇక, కారకాస్‌లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. దాని నుంచి ముఖ్యమైన సూచనలు చేస్తోంది.
👉బాబును బుక్ చేసిన రేవంత్.. ఇరకాటంలో ఏపీ సర్కార్… తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో అధికార టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో అధికార టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు భావిస్తున్నా, ఆయన మాటల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
దీంతోనే టీడీపీ వెనువెంటనే అప్రమత్తమైందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడించడమే కాకుండా, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై వివరణలు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా స్పందించకపోయినా, ఆయన తరఫున టీడీపీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేయడం చూస్తే తెలంగాణ సీఎం తన రాజకీయ గురువును ఇరకాటంలో పడేశారని విశ్లేషిస్తున్నారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని నిలిపివేస్తేనే ఏపీతో చర్చలకు వస్తాం’’ అంటూ తాను చంద్రబాబుతో చెప్పానని, తనపై గౌరవంతో ఆయన రాయలసీమ ప్రాజెక్టు నిలిపేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి మాటలు వల్ల తెలంగాణలోనే ఆయనకు రాజకీయంగా లబ్ధి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఆలోచనతోనే ఆయన అలా మాట్లాడి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల మంచి కోరే తాను ఇన్నాళ్లు ఈ విషయం బయటపెట్టలేదని, ఇప్పుడు విపక్షం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడం వల్ల బహిరంగంగా చెప్పాల్సివస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఆయన ఇలా మాట్లాడటం వల్ల ఏపీలో చంద్రబాబు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కల్పించారు. ఈ కారణంగా టీడీపీ అప్రమత్తమైందని చెబుతున్నారు….***చంద్రబాబును ఇరకాటంలో పెట్టేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాజకీయాల కోసం అక్కడి అధికార, ప్రతిపక్షాలు చంద్రబాబును కేంద్రంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతోంది. మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతున్న ఏపీ ప్రభుత్వం కూడా ఆఘమేఘాలపై ప్రకటించింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్దమని వెల్లడిస్తూ, జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టను చేపట్టారని, అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసి ప్రాజెక్టును నిలిపివేసిందని సవివరంగా ప్రకటన జారీ చేసింది. మిగిలిన మంత్రులు ఫాలో కావాలంటున్న సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై ఎదురుదాడి చేస్తూ, రాయలసీమ ప్రాజెక్టు నిలిచిపోవడానికి రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని, బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే కోర్టుల్లో కేసులు వేయడం వల్ల నాటి జగన్ ప్రభుత్వమే పనులు చేపట్టలేకపోయిందని చంద్రబాబు ప్రభుత్వం వివరిస్తోంది. దీనివల్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తాను నష్టపోకుండా ఆత్మరక్షణకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో 2020లోనే కేంద్రం విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసిందని టీడీపీ చెప్పడంతో తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య జల యుద్ధం మరో మలుపు తిప్పినట్లైందని అంటున్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని, ఇందులో రేవంత్ రెడ్డి ఘనత ఏమీ లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని చెప్పడమే కాకుండా, రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు బయటపెట్టేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
👉ఒంగోలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస… ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎంపీ మాగుంట మధ్య వాగ్వాదం
వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా..పనులు ఎలా పూర్తి చేస్తారన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్…జెడ్పీ సమావేశంలో రాజకీయాలు చేయొద్దన్న ఎంపీ మాగుంట …సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన ఎంపీ మాగుంట…వైసీపీ MLAల విషయంలో ప్రొటోకాల్ పాటించడంలేదని..ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపణలు
👉ప్రకాశం జిల్లా మార్కాపురం ఘనంగా స్వర్గీయ కందుల ఓబుల రెడ్డి 33 వ వర్ధంతి కార్యక్రమం .స్వర్గీయ కందుల ఓబులరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు మాజీమంత్రివర్యులు.దూరాలోచన, లోతైన పరిశీలన, ప్రగతి కోసమై పాలన, నిజాయితీకి నిలువెత్తు దర్పణం .1972 లో కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ కలిపినప్పుడు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని నిరంతరం పోరాడిన ధీరుడు…వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1980 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యని ఒప్పించి, ప్రాజెక్టు ప్రతిపాదన చేసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేపించారు . ప్రజా శ్రేయస్సే ఊపిరిగా, జీవితాన్ని కర్పూరంగా వెలిగించి. రాజకీయ విలువలకై ఎందరో నాయకులను ఎదిరించిన ధీశాలి. ప్రజల హృదయాలలో నివసిస్తున్న దివ్యమూర్తి. సుదీర్ఘ 35 సంııలుగా శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్ గా వ్యవసాయ, ఆటవీ , పశుసంవర్ధక శాఖ ,నీటిపారుదల శాఖామాత్యులుగా, “పుల్లరి” విధానాన్ని రద్దుచేసి, నీటిపారుదల రంగంలో అవిశ్రాంతంగా కృషిచేసిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సార్ధక నామధేయులు. రైతు భాంధవుడు, ప్రజలతో మమేకమైన మహామనిషి స్వర్గీయ కందుల ఓబులరెడ్డి అని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు..ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం మరియు కంభం నియోజకవర్గాలకు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించడం చెప్పుకోదగ్గ విషయం . ఎందరో రాజకీయ నాయకులకు ఓనమాలు దిద్దించి, పంచెకట్టించిన రాజకీయ గురువు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎందరో గొప్ప గొప్ప నాయకులుగా తయారు కావడం జగమెరిగిన సత్యం… పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కడప రామసుబ్బమ్మ, కొణిజేటి రోశయ్య, సర్దార్ గౌతు లచ్చన్న , భవనం వెంకట్రామి రెడ్డి తదితరులు కందుల ఓబులరెడ్డికి కి ముఖ్య అనుచరులుగా పనిచేశారు. భారతదేశ మొదటి డెప్యూటీ ప్రధాన మంత్రి మరియు హోమ్ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓబుల రెడ్డి గారు సన్నిహితంగా ఉండేవారు !! రైతు జన బాంధవ్యులు ఆచార్య NG రంగా గారి శిష్యులుగా బ్రిటీష్ పాలనలో అనేక రైతాంగ పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు, నిష్కపటి, నిరాడంబరుడైన స్వర్గీయ శ్రీ కందుల ఓబులరెడ్డి గారి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం.ఓబుల రెడ్డి 1983లో రాజకీయాల నుండి వైదొలిగారు.
స్వర్గీయ ఎన్ . టీ. రామారావు టీడీపీ పార్టీ స్థాపించి ఓబుళరెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సలహాదారునిగా సూచనలు, సలహాల కోసం ఆహ్వానించినా, సున్నితంగా తిరస్కరించినా అయన శేష జీవితాన్ని స్వగ్రామం లింగాపురంలో గడిపారు. 03.01.1993 వ తేదీన స్వర్గస్థులైనారు .మార్కాపురం డివిజన్లో ఆర్ధికంగా అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం , ఆర్ధికంగా , సామాజికంగా అభివృద్ధి చెందిన సమాజం కోసం ఎనలేని కృషి చేసారు . విద్య , వైద్య , ఉద్యోగ , ఉపాధి రంగాల్లో వేలాది మందికి సహాయ సహకారాలు అందించారు .వందలాది మందికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశం కల్పించారు . ఓబులరెడ్డి రైతుకు, వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగంలోచేసిన సేవను ప్రభుత్వం గుర్తించి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఓబులరెడ్డి పేరు పెట్టి జాతికి అంకితం చేసి ఆయన పేరు చిరస్మరణీయం చేసారు !…ఓబుల రెడ్డి 33 వ వర్ధంతి సందర్బంగా కందుల గౌతమ్ నాగి రెడ్డి ఆధ్వర్యంలో SVKP కాలేజీ ఎదురుగా ఉన్న ఓబుల రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి అయన అభిమానులు , సన్నిహితులు , శిష్యులు మరియు అనుయాయులు ఆ మహానుభావున్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది .
👉 నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి, భారతి అనే మహిళకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన మనవడి వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తును ఎమ్మెల్యే తిరస్కరించారని సదరు మహిళ నిలదీయడంతో వివాదం మొదలైంది. “నన్ను చంపిస్తావా?” అని ఆమె ప్రశ్నించాగా.. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
👉ఇంచార్జి ఆర్ ఎమ్ గా జి. సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ..బస్టాండ్ అభివృద్ధికి చర్యలు..ఆర్టీసీ ఇడి నాగేంద్ర ప్రసాద్ వెల్లడి…మార్కాపురం…
జిల్లా కేంద్రమైన మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ జోన్ 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.స్థానిక ఆర్టీసీ గ్యారేజీలో నూతనంగా రీజినల్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఇ డి నాగేంద్ర ప్రసాద్ సమక్షంలో నూతన ఇంచార్జి ఆర్ ఎమ్ గా జి. సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్లాట్ ఫారం ల సంఖ్యను పెంచడంతో పాటు, టాయిలెట్స్ ఇతరాత్ర సౌకర్యాలను మెరుగుపరచనున్నామని అన్నారు.ఇందుకోసం టెండర్లను కూడా పిలవడం జరిగిందని, త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో గిద్దలూరు, కనిగిరి,పొదిలి, మార్కాపురం మొత్తం 4 డిపోలు ఉన్నాయని, ఇందులో మొత్తం 320 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు.
తమ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు సురక్షితంగా తమ గమ్యస్థాలకు చేర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. శ్రీశైలం వెళ్ళు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం మార్కాపురం డిపో నుండి 11 బస్సులను నడుపనున్నట్లు తెలిపారు.అవసరాన్ని బట్టి మరిన్ని సర్వీసులు తిప్పనున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 100 శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.నాగేంద్ర ప్రసాద్ అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జీ.సత్యనారాయణ, స్థానిక డిపో మేనేజర్ అవ్వారి నరసింహులు పాల్గొన్నారు.
👉AP మోడల్ స్కూల్, పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం*మార్కాపురం జిల్లా…!!!!
పెద్ద దోర్నాల మండలం మల్లిఖార్జునపురం గ్రామంలో ఉన్న AP మోడల్ స్కూల్‌లో సివిక్స్ సబ్జెక్టు బోధన కోసం గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సరళ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నియామకం గెస్ట్ ప్రాతిపదికన నెలకు రూ.12,000 జీతంతో ఐదు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. బీఈడీ మరియు ఎమ్మె (పాలిటికల్ సైన్స్) అర్హతలు కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో ఈ నెల జనవరి 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.00 గంటలకు పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నేరుగా AP మోడల్ స్కూల్, మోట్ల మల్లికార్జునపురం ప్రిన్సిపాల్ సరళ ను సంప్రదించాలని తెలిపారు.ఫోన్ నంబర్: 8985465653
👉పోలీసు స్టేషన్ ఎదుటే దారుణ హత్య*
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఈశ్వర ప్రసాద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల ఎదుటే దుండగులు ఈశ్వర ప్రసాద్ ను నరికి చంపారు. వివాహేతర సంబంధం అనుమానంతో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు…నిందితులు హరి, చెన్నప్ప లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం… సంఘటన స్థలానికి డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సీఐ నాగేంద్ర, ఎస్సై గోపి చేరుకొని పరిశీలిస్తున్నారు.
👉గర్భిణీ అని చూడకుండా కడుపుపై కొట్టిన మహిళా పోలీసు అధికారి*…మొయినాబాద్ – పెద్దమంగళారం లంబాడాల ఇండ్ల కూల్చివేతల ఘటనలో బైటికొస్తున్న దారుణాలు… పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 210, 211, 212లలో లంబాడాలు ప్లాట్లు కొని కట్టుకున్న ఇళ్లను వారం రోజుల కిందట కూల్చేసిన అధికారులు… ఉదయం 6 గంటలకు పోలీసులు, అధికారులు ఇంట్లోకి వచ్చి మా ఫోన్లు లాక్కొని, మమ్మల్ని బయటకు గుంజేశారు..నేను 5 నెలల గర్భిణీని అని చెప్పినా కూడా కడుపు మీద మహిళా పోలీసు అధికారి కొట్టింది..మేము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు అంటూ పోలీసుల కాళ్లు మొక్కినా కూడా కనికరించకుండా మా సామాన్లు బయట పడేశారు..7 రోజుల నుండి ఇదే చలిలో పడుకుంటున్నాం, బయటే వండుకొని తింటున్నాం…కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలగొట్టారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. మాకు న్యాయం కావాలంటూ బాధితుల ఆవేదన
👉 ప్రజలకు చేరువగా ప్రభుత్వ యంత్రాంగం.*.
👉 పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలకు గౌరవం, గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ జిల్లా అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో నిర్వహించిన ‘ స్వచ్ఛ సంక్రాంతి – వికసిత్ భారత్ జీ రామ్ జీ గ్రామసభ ‘ లో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.గ్రామసభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా, ‘ వికసిత్ భారత్ – జీ రామ్ జీ చట్టం ‘ కింద గ్రామస్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను తెలియజేసేలా ఈ గ్రామసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల శుభ్రతపై ప్రతినెలా ఒక ప్రత్యేక ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో ‘ స్వచ్ఛ సంక్రాంతి ‘ పేరుతో విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల స్వచ్ఛత, ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మద్దతు, సహకారంతో ప్రత్యేక జిల్లాను సాధించుకున్నామన్నారు. తనకు లభించిన పునర్జన్మను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సార్ధకం చేసుకుంటానని ప్రకటించారు. ఈ ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో 119 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లాస్థాయి హాస్పిటల్ కు పెంచామన్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వ్యర్ధాల నిర్వహణ, పారిశుద్ధ్యము, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడం ద్వారా రైతులను కోటేశ్వరులను చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్థానికంగానూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మార్కాపురం జిల్లాలో విస్తారంగా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక జిల్లా కావాలని ఆకాంక్షించామని, అదే స్ఫూర్తితో ఆశయాల సాధనకు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించేలా చూడాలని, డిమాండుకు తగినట్లుగా గోకులం షెడ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తమ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రతిపాదనలను డిపిఓ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ దిశగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కలెక్టర్, ఎమ్మెల్యే, గ్రామస్తులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ బి.కుమారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

