👉బాబాయ్ హత్యే చిన్నదైనప్పుడు…. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం..!!! బాబాయి దారుణ హత్యే చిన్న విషయంగా భావించిన వారికి.. శ్రీవారి పరకామణి దొంగతనం కేసు పెద్దవిషయం ఎలా అవుతుం దని.. అసలు వారికి ఇది పెద్ద విషయం అవుతుందని కూడా భావించడం మనతప్పేనని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన జగన్.. శ్రీవారి పవిత్ర లడ్డూ కల్తీ కావడం.. అదే ఆలయంలో పరకామణిలో డాలర్ల దొంగతనం వ్యవహారాలను ప్రస్తావించారు. అయితే.. అవేవీ పెద్ద విషయాలు కావన్నట్టుగా జగన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని తెలిపారు. బాబాయి దారుణ హత్యే చిన్న విషయంగా భావించిన వారికి.. శ్రీవారి పరకామణి దొంగతనం కేసు పెద్దవిషయం ఎలా అవుతుం దని.. అసలు వారికి ఇది పెద్ద విషయం అవుతుందని కూడా భావించడం మనతప్పేనని చంద్రబాబు అన్నారు. నైతికత లేని వారు ఇలానే వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేశారని.. పాలు కాని పాలతో నెయ్యికాని నెయ్యితో ఈ లడ్డూలు తయారుచేసి.. పవిత్రతకు భంగం కలిగించారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారి వల్లే శ్రీవారి ఆలయం అపవిత్రం అయిపోయిందన్నారు. పరకామణిలో కోట్లాది మంది భక్తులు శ్రీవారికి ముడుపులు సమర్పించుకుంటారని.. అలాంటి వాటిని దొంగతనం చేసింది కాక.. దానిని సమర్థించుకునే వారు తయారయ్యారని వ్యాఖ్యానించారు. “నేను నా జీవితంలో ఎప్పుడూ దొంగలతో సెటిల్‌మెంట్లు చూడలేదు. తొలిసారి తిరుమల పరకామణి కేసులోనే విన్నాను. 70 వేలు కొట్టేసి.. 14 కోట్ల రూపాయలు ఇచ్చారంటే.. వారెంత గా సంపాయించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. వారెంత ఘటికులో అర్థం అవుతుంది. శ్రీవారి సొత్తును ఇంకెంత దోచేశారో.. అన్న అనుమానాలు కూడా భక్తులకు వ్యక్తమవుతున్నాయి.“ అని చంద్రబాబు అన్నారు. జగన్‌కు లెక్కలేదు.. “జగన్‌కు కుటుంబ సభ్యులంటే పట్టదు. దేవుడంటే కూడా పట్టదు. ఆయనకు దేవుడన్నా.. భక్తులన్నా.. ఆలయాలన్నా చులకన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న పాపం“ అని చంద్రబాబు అన్నారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్… పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని చంద్రబాబు అన్నారు. దొంగతో ఎవరైనా ఒప్పందాలు సెటిల్మెంట్లు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
👉ఉద్యోగుల కోసం కొత్త బిల్లు : రైట్ టు డిస్ కనెక్ట్ అమలవుతుందా? సాధ్యమేనా? పార్లమెంట్ లో తాజాగా కొత్త కార్మిక బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇది ఉద్యోగులకు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ అంటే పని నుంచి విరామం తీసుకునే హక్కును కల్పిస్తుంది. ఇప్పుడు అంతా గొడ్డు చాకిరీనే. ఎప్పుడో ఉదయం 8 గంటలకు పని మొదలుపెడితే.. రాత్రి 10 , 11 అయ్యేవరకూ వేళాపాళా లేని పనులు.. ఉద్యోగులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యాలు. జీతాల కోసం తప్పని వెతలు. కార్మిక మూస చట్టాలతో ఇన్నాళ్లు ఉద్యోగులకు అసలు హక్కులు లేకుండా పోయాయి. అయితే కేంద్రం కార్మికుల కష్టాలను గమనించి కొత్త కార్మిక చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఇప్పుడు దీని అమలు కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే కేంద్రం ఎన్ని చట్టాలు చేసినా వాటిని అమలుచేయాల్సిన యాజమాన్యాలు, అధికారులు నిక్కచ్చిగా ఉంటారా? ఉద్యోగుల కష్టాలు తీరుతాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పార్లమెంట్ లో తాజాగా కొత్త కార్మిక బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇది ఉద్యోగులకు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ అంటే పని నుంచి విరామం తీసుకునే హక్కును కల్పిస్తుంది. ఇది ఐటీ రంగం వంటి వాటిలో ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దీని అమలు పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఏంటీ ‘రైట్ టు డిస్ కనెక్ట్’ బిల్లు.. ఏముంది? ఎందుకోసం? ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్ కనెక్ట్ బిల్ 2025’ ను ప్రవేశ పెట్టారు. పనివేళల తర్వాత యజమానుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించకుండా ఉండే హక్కును ఈ బిల్లు ప్రతీ ఉద్యోగికి ఇస్తుంది. ఒక ఉద్యోగి పనివేళలు దాటిన తర్వాత కాల్స్, లేదా ఈమెయిల్స్ కు స్పందించకపోయినా దానిపై కంపెనీల ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు, ఉద్యోగుల లేదా వారి ప్రతినిధులతో కలిసి పనివేళలు దాటి తర్వాత పనిచేసే నిబంధనలు , షరతులపై చర్చలు జరపాలి. ఒకవేళ ఉద్యోగులు పనిచేస్తే వారికి ఓవర్ టైమ్ వేతనం చెల్లించాలి. ఈ నిబంధనను పాటించని కంపెనీలకు జరిమానా విధించాలని కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై కౌన్సిలింగ్ సేవలు, డిజిటల్ డిటాక్స్ కేంద్రాల ఏర్పాటుకు ఈ బిల్లు సిఫారసు చేస్తుంది.
భారత దేశంలో ఉద్యోగుల పని పరిస్థితులు అమెరికా, యూరప్ మార్కెట్ ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై అంతగా దృష్టి పెట్టరు. విదేశాల్లో మాత్రం అది స్ట్రిక్ట్ గా అమలవుతుంది. ఉద్యోగులు పనివేళలు ముగిసిన తర్వాత కూడా తమ యజమానుల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్, ఈమెయిల్స్ కు అందుబాటులో ఉండాలని ఇండియాలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల భారత్ లో ఉద్యోగులు తమ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. నేటి డిజిటల్ సంస్కృతి కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడిని అధిగమించడానికి విరామం అవసరం. ఆరోగ్యకరమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన జీవితానికి సమతుల్యతను ఇస్తుంది. ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన చర్యగా పేర్కొంటున్నారు.
ఇప్పటికే విదేశాల్లో ఈ బిల్లు అమల్లో ఉంది. యూరప్ దేశాలు, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇప్పటికే రైట్ టు డిస్ కనెక్ట్ అనేది సాధారణ పద్ధతిగా ఉంది. కానీ భారత్ లో మాత్రం ఉద్యోగలకు ఇది పూర్తిగా కొత్త విషయంగా ఇప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ బిల్లుపై దేశంలో చర్చ జరుగుతోంది. బిల్లు ఆమోదం పొందుతుందా? ఈ బిల్లును ఎన్సీపీ ఎంపీ ప్రతిపాదించారు. అధికార ఎన్డీఏ బీజేపీ నుంచి ఈ బిల్లు రాలేదు. సో పూర్తిగా ఇదో ప్రైవేట బిల్లు.. ఇలాంటి ప్రైవేటు బిల్లులు చట్టాలుగా మారడం చాలా అరుద. 1970 తర్వాత ఒక్క ప్రైవేటు బిల్లు కూడాrf పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. ప్రస్తుతానికి ఈ బిల్లు పార్లమెంట్ లో చట్టంగా మారే అవకాశాల తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగుల శ్రేయస్సు , వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై చర్చను మాత్రం దేశంలో బలంగా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
👉స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు
శాసనసభ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు…రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు..డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు..రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు.
👉పోలీస్ స్టేషన్లో దొంగతనం…దొంగల వద్ద రికవరీ చేసిన రూ.1.75 లక్షల ఫోను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్… హైదరాబాద్ – మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోను పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి…సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని, ఫోన్ రికవరీ చేసి, లాకర్లో దాచిపెట్టిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది…రూ.1.75 లక్షల ఫోన్ కావడంతో దానిపై కన్నేసి, కొట్టేసిన పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ … శ్రవణ్ కుమార్ దొంగతనం చేసాడని నిర్ధారించి, అతన్ని రిమాండుకు తరలించిన ఉన్నతాధికారులు.
👉 గోవాకు వెళ్ళే జంటలు జాగ్రత్త!…గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసిన హోటల్ యజమాని…మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్నా వినకుండా బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు…హైదరాబాద్ – ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లగా, వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్(40) అనే వ్యక్తి…ఇటీవల మహిళకు ఫోన్ చేసి, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన యశ్వంత్ తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకున్నా యశ్వంత్ వినకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ…మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సనత్‌నగర్ పోలీసులు…

