👉వంద కోట్ల పరకా’మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు.. మంత్రి లోకేశ్ హాట్ ట్వీట్ !!! తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండ లతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని లోకేశ్ ఆరోపించారు.
*టీటీడీపై మరోమారు రాజకీయ దుమారం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పరకామణిలో రూ.వంద కోట్లు దోచుకున్నారని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించిన వెంటనే మంత్రి లోకేశ్ రంగంలోకి దిగారు. భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలను సమర్థించిన లోకేశ్.. గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. పరకామణిలో అమెరికన్ డాలర్లను దొంగిలించిన వీడియోను భానుప్రకాష్ రెడ్డి మీడియా సమక్షంలో ప్రదర్శించగా, ఆ వీడియోను లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘జగన్ హయాంలో తిరుమలలో మహాపచారం.. వైసిపి గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. రూ.వంద కోట్ల పరకా’మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు’’ అంటూ లోకేశ్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ‘‘జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేసారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్… చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు.’’ అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని లోకేశ్ ఆరోపించారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేశ్ ఆరోపించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టిటిడి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు.’’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఏడుకొండలు జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. అప్పట్లోనే చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారని లోకేశ్ వివరించారు. చంద్రబాబు మాట వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. అంటూ చిత్తూరు యాసలో పోస్టు చేశారు లోకేశ్. శ్రీవారికి అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ మంత్రి లోకేశ్ హెచ్చరించారు
👉గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ..
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ముందుగా నాయుడుపాలెం గ్రామ ప్రవేశ మార్గంలో ఉన్న భారత రత్న బి.ఆర్.అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు వీరు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. రూ.2 కోట్లతో చేపట్టే ఎస్సీ కాలనీలోని అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ శిలాఫలకాన్ని కూడా ఆమె ఆవిష్కరించారు. తదుపరి గ్రామంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కే.వీ. విద్యుత్తు ఉప కేంద్రాన్ని కూడా ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరమని అన్నారు. అందుకే వీటి నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. అనంతరం
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉప కేంద్రాన్ని ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రం వలన తూర్పు నాయుడుపాలెం, శివాపురం, మల్లవరప్పాడు, సూరారెడ్డిపాలెం, కారుమంచి, వల్లూరు, వసపల్లిపాడు గ్రామాలలో లోవోల్టేజీ సమస్యను నివారించవచ్చు అన్నారు. ప్రజలపై అదనపు భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి రవి స్పష్టం చేశారు. కార్యక్రమాలలో రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్సన్ బాబు, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఇతర ప్రముఖులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మర్లపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
👉క్యాప్స్ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు.. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్
ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు..చందా శ్రీనివాస్, అభిషేక్‌ను విచారించిన అధికారులు… హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను..బినామీలుగా ఉంచిన క్యాప్స్ గోల్డ్ యాజమాన్యం.. బంగారం స్కీమ్‌లు నడిపిస్తున్న క్యాప్స్ గోల్డ్.. నగదు ట్రాన్సాక్షన్ విషయంలో అవకతవకలు గుర్తించిన ఐటీ… బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10తో పాటు..మహంకాళి స్ట్రీట్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..
👉సజ్జల రామకృష్ణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*హైదరాబాద్ గచ్చిబౌలి నందు సజ్జల రామకృష్ణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మరియు వారి తనయుడు అన్నా కృష్ణచైతన్య…*
👉అంగన్వాడీల సంక్షేమాన్ని విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని పలువురు నాయకులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 11వ రాష్ట్ర మహాసభల రెండో రోజు ఆదివారం నాడు జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చట్టసమ్మతం కాని ఎస్మా ను ఎదిరించి 42 రోజులు పోరాడి, సమ్మెకాలానికి కూడా వేతనం సాధించుకున్న ఘనత అంగన్వాడీ సంఘానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఎపి మధ్యాహ్న భోజనపధకం వర్కర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీలు అక్కల్లాంటి వారని మధ్యాహ్న భోజన పధకం ఇతర స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం లోను సహకారం అందించాలన్నారు. మహాసభలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రఘరాం, ఆల్ రిటైర్డ్ పర్సన్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి శేషయ్య సంఘీభావ సందేశం అందించారు. మహాసభలో సంఘ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు,రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి బేబీ రాణి, కారుసాల సుబ్బరావమ్మ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగ రావు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు పాల్గొన్నారు.
👉అప్పులు ఎగ్గొట్టిన కార్పొరేట్ల ఆస్తులు ఎందుకు జప్తు చేయరు? .. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ తీసుకున్న రూ. 8వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో 70 శాతం మాఫీ చేసి.. 30 శాతం కడితే చాలునని బ్యాంకులు వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చాయి. అదేం మహాభాగ్యం కట్టేసి.. క్లీన్ గా బయటకు వచ్చి మళ్లీ వేల కోట్లు అప్పులు తీసుకుంటామని ఆ సంస్థ రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే .. వారి ఆస్తుల్ని జప్తు చేసి ఎందుకు వేలం వేయరన్నదే.
🌟వేల కోట్లు ఎటు పోతాయి.. బినామీల ఖాతాల్లోకి తప్ప ?
గాయత్రి ప్రాజెక్ట్సు రుణాలు తీసుకున్నది లాటరీలు ఆడటానికి..పార్టీలు చేసుకోవడానికి కాదు. నిర్దిష్టమైన ప్రాజెక్టుల కోసమే రుణాలు ఇచ్చారు. ఆ సంస్థ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చారు. వాటిని కట్టి ప్రభుత్వం నుంచి రావాల్సింది తీసుకుని ఉంటారు. అలాగే టోల్ గేట్లు పెట్టుకుని వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బులను బ్యాంకులకు ఎందుకు చెల్లించలేదు?. వాటిని ఇతర బినామీ ఆస్తులు పెంచుకుని.. అసలు కంపెనీని మాత్రం దివాలా తీయించారు. ఇప్పుడు ఆ కంపెనీ రుణాలను అణాకాణీలు కట్టి మాఫీ చేయించుకుంటున్నారు.
🌟వేల కోట్లు ఎగ్గొడుతున్న కార్పొరేట్లు – మళ్లీ మళ్లీ రుణాలు.. ఒక్క సుబ్బరామిరెడ్డి కాదు..కార్పొరేట్లు అందరిదీ ఇదే దారి. అదానీ కంపెనీలకూ ఇలా రుణాల రీస్ట్రక్చరింగ్ చేసి.. చివరికి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వీరు మాత్రమే కాదు.. కొన్ని వేల కోట్లు ఇలా రైటాఫ్ చేస్తున్నట్లుగాఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరందరికీ మళ్లీ మళ్లీ కొత్త కంపెనీల ద్వారా రుణాలు వస్తూనే ఉన్నాయి. చివరికి అనిల్ అంబానీనే తీసుకుంటే.. ఆయనకు ఇప్పటికీ వేల కోట్లు ఆస్తులు ఉంటాయి. కానీ దివాలా కేటగిరీలో చేర్చిరైటాఫ్ చేయడం తప్ప మరో మార్గం అనుకుంటూ ఉంటారు.
🌟వాళ్లను అరెస్టు చేసే చట్టాలు తేవాలి!
ఈ కార్పొరేట్లు వ్యక్తిగతంగా ఏమీ చేయరు. కంపెనీల పేరు మీద చేస్తారు. ఆస్తుల్ని బినామీల మీద ఉంచుకుంటారు. బ్యాంకులకు డబ్బులు చెల్లించకపోతే ఆ కంపెనీలే బాధ్యులవుతాయి కానీ వ్యక్తిగతంగా కారు. అందుకే వారి ఆస్తులు వారి వద్దే ఉంటున్నాయి. మోసపోతోంది బ్యాంకులు. అంటే వారి వద్ద డిపాజిట్లు చేస్తున్న ప్రజలే . ఈ కార్పొరేట్లకు దందాకు ఎప్పుడు అడ్డుకట్ట పడితే అప్పుడే ఆర్థిక నేరాలు తగ్గుతాయి. చైనాలో బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టినందుకు కఠిన శిక్షలు వేస్తారు. అందుకే అక్కడ అర్థిక నేరాలు ఉండవు. కానీ ఇక్కడ బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టడం కార్పొరేట్లకు ఓ వ్యాపార విజయంగా మారింది.

