👉వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం.*
*డాక్టర్స్ డే రోజున ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది.*
*అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.*
-మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులపై డాక్టర్స్ డే రోజునే జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని, ఎంసీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఢిల్లీ వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని, ఏడాదిపాటు ఇంటర్నెషిఫ్ పూర్తిచేసుకుని, ఇలా అన్ని రకాల అర్హత సాధించిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎందుకు ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించింది? తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్లుగా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలంటూ వారు డిమాండ్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం తప్పు అవుతుందా? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిపై వార్నింగ్ ఇవ్వడమేంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓవైపు రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీల్లో పనులు అడ్డుకుని, సీట్లు పెరగనీయకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నవారే అడ్డుకున్నారు. కేంద్రం ఇచ్చిన సీట్లు తీసుకోకుండా తిరస్కరించారు.అవినీతికి పాల్పడుతూ ఈ మొత్తం కాలేజీలను తమ వాళ్లకు కట్టబెట్టే దిశగా కదులుతున్నారు. మరోవైపు ఇక్కడ సీట్లు లేక, విదేశాల్లో చదువులు పూర్తిచేసుకున్న వైద్య విద్యార్థులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
👉పెయిడ్ పాత్రికేయులతో తలనొప్పులు.. టీడీపీ, వైసీపీలకు ఒకే రకమైన టార్చర్ నిన్న వైసీపీ.. ఈ రోజు టీడీపీ.. తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో చిక్కుల్లో పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. నిన్న వైసీపీ.. ఈ రోజు టీడీపీ.. తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో చిక్కుల్లో పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. యూట్యూబ్, డిజిటల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో ఇటీవల కాలంలో ఇండిపెండెంట్ జర్నలిజం ఎక్కువైంది. దీంతో చాలా మంది జర్నలిస్టులు సొంతంగా చానళ్లు ప్రారంభిస్తున్నారు. కొందరు కొన్ని చానళ్లలో జరిగే డిబెట్లకు వెళుతూ తమ వాణి వినిపిస్తున్నారు. అయితే కొందరు జర్నలిస్టులు ఇలా డిబేట్లు, తమ చానళ్లలో విశ్లేషణలలో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటమే విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో ఆయా పార్టీల గ్రాఫ్ ను దెబ్బతీస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెయిడ్ పాత్రికేయం పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో శ్రుతిమించిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూట్యూబ్ ప్రభావంతో చాలా కాలం క్రితమే కొందరు జర్నలిస్టులు పెయిడ్ గెస్టులుగా మారిపోయారని అంటున్నారు. పార్టీల నుంచి డబ్బు తీసుకుని ఆ పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ప్రజలపై వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందో కానీ,ఆయా పార్టీలు మాత్రం ఎక్కువగా దెబ్బతింటున్నాయని అంటున్నారు. గత ఎన్నికల వరకు వైసీపీకి ప్రజల్లో మంచి గ్రాఫ్ ఉందని ఈ పెయిడ్ జర్నలిస్టులు చేసిన ప్రచారంతో ఆ పార్టీ ఎక్కువగా నష్టపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా చాలా మంది హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూర్చొని ఇదే ప్రజాభిప్రాయం అంటూ తమ సొంత వ్యాఖ్యానాలు చేయడం పార్టీల నాయకత్వాలు కూడా అదే నిజమని నమ్మి దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఇది ఒక్క వైసీపీకే కాదని తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి పెయిట్ జర్నలిస్టులను ఎక్కువగా నమ్ముకుందని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయంటున్నారు. అటు తెలంగాణలోనూ అన్నిపార్టీలు కూడా కొందరు జర్నలిస్టులను ఎంగేజ్ చేసుకుని తమకు అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. అయితే పార్టీల నుంచి డబ్బు అందుకుంటున్న కొందరు జర్నలిస్టులు టీవీ చానళ్ల డిబేట్ సందర్భంగాను, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతరులను కించపరిచేలా, టార్గెట్ చేసిన వారి ఆత్మస్థైర్యం దెబ్బకొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. రిటైర్ అయిన జర్నలిస్టులు, ఉద్యోగాలు లేని పాత్రికేయులు ఎక్కువగా ఎనలిస్టు అవతారం ఎత్తడం, వారిని సమన్వయం చేయడంలో పార్టీలు పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఎనలిస్టులుగా మారిన జర్నలిస్టులు వల్ల మేలు జారుతుందని ఆశిస్తే, కీడే ఎక్కువగా జరుగుతుందని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.
👉మాజీ ఎంపీ నందిగం సురేష్ కి పోలీసుల షాక్…
బెయిల్ మంజూరు అయిన కొద్ది గంటలోనే మరో పీటీ వారెంట్…ఉద్దండరాయునిపాలెం కి చెందిన రాజు పై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న సురేష్..సబ్ జైలు నుంచి విడుదలయ్యే లోపు అందులోకి తీసుకున్న పోలీసులు…
మరికొద్దిసేపట్లో నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు….
గతంలో కోర్టు వాయిదాలకు సరిగా హాజరు కాకపోవడం పై అందుపులోకి తీసుకున్నట్లు సమాచారం…
👉పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుంచే అమలులోకి..!*
ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కి.మీకు రూ.2 పైసలు, నాన్ ఏసీలో కి.మీకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు.
ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు సాధారణ ఛార్జీలు. 501 నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5..1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10.. 2501 నుంచి 3000 కి.మీ వరకు రూ.15 చొప్పున పెంపు.ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు అరపైసా చొప్పున పెంపు.
మెయిల్/ఎక్స్‌ప్రెస్(నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంపు.
అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కి.మీకు రూ.2 పైసలు చొప్పున పెంపు.
మంగళవారం నుంచి ఈ ఛార్జీలు అమలులోకి.
👉ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 66వ రోజు ప్రజాదర్బార్ లో ప్రజల విజ్ఞప్తులు*
*కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా*
*మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితుడు మోసం చేశాడు*
*ప్రాణాంతక జన్యువ్యాధితో బాధపడుతున్న 9 నెలల చిన్నారిని కాపాడండి*
ఉండవల్లి: ఆపద ఏదైనా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 66వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. ప్రతిఒక్కరి అర్జీ పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిఒక్కరికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు…
మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితుడు మోసం చేశాడు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, వాడపాలెంకు చెందిన సజ్జల సన్నిహితుడు అడపా ప్రేమ్ చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను మెడికల్ సీటు గురించి ప్రశ్నించగా.. అప్పటి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానంటూ రెండు కోట్లు డిమాండ్ చేశారు. అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో తాము కట్టిన నగదుకు బెంగుళూరులోని రామయ్య మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి సీట్ అలాట్ మెంట్ కు సంబంధించి నకిలీ లేఖను చేతిలో పెట్టి మోసం చేశారు. నగదును తిరిగి ఇవ్వాలని కోరగా సజ్జల పేరుచెప్పి బెదిరిస్తున్నారు. తప్పుడు పత్రాలతో తమను మోసం చేశారని, తమకు రావాల్సిన నగదును తిరిగి ఇప్పించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– మంగళగిరి నియోజకవర్గం కంతేరులో తమ కుటుంబానికి చెందిన 0.70 ఎకరాల వ్యవసాయ భూమిని ఐదేళ్ళ క్రితం విక్రయించామని, అయితే పొలం విక్రయం తాలూకా బాకీ ఉన్న రూ.12 లక్షల నగదు ఇవ్వకుండా గ్రామానికి చెందిన విష్ణు, రాము తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఉండవల్లికి చెందిన కల్లం విజయలక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– ఎస్ఎంఏ(స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ) అనే ప్రాణాంతక జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ 9 నెలల బాలుడికి వైద్యసాయం అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరామ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి 10వేల మందిలో ఎకరు ఎస్ఎంఏతో జన్మిస్తారని, ప్రపంచంలో ఖరీదైన జోల్ జెన్ స్మా(zolgensma) మందు ఒక్కటే నివారణ అని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్ అయినందున సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు ఆ ఇంజక్షన్ కొనుగోలు చేసే ఆర్థికస్థోమత లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తరపున వైద్యసాయం అందించి తమ చిన్నారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడినైన తనను వైసీపీ ప్రభుత్వ హయాంలో లేటి సుధీర్, గంధం ప్రసన్నాంజనేయులు, వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, తన ఇంటిని కూల్చడంతో పాటు తన 2.50 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం, తిమ్మసముద్రానికి చెందిన తోటకూర వెంకట సురేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వ్యవసాయ భూమికి పట్టా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– పల్నాడు జిల్లాలోని బిషప్స్, పాస్టర్స్, క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పాస్టర్స్ అందరికీ ప్రభుత్వం నుంచి మ్యారేజీ లైసెన్స్ లు మంజూరుచేయడంతో పాటు పల్నాడు జిల్లాలోని అర్హులైన దైవ సేవకులకు ప్రతి నెల రూ.5వేలు గౌరవ వేతనం మంజూరుచేయాలని కోరారు. చర్చి స్థలాలకు ధృవీకరణ పత్రం, చర్చిల నిర్మాణం, మరమ్మతులకు నిధులు కేటాయించాలన్నారు. క్రిష్టియన్ కమ్యూనిటీ హాల్స్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– ఇంజనీరింగ్ చదివిన తనకు అర్హతకు తగిన ఉద్యోగ అవకాశం కల్పించాలని విజయవాడ విద్యాధరపురానికి చెందిన బి.చంద్రలేఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– సాక్షర భారత్(వయోజన విద్య) కార్యక్రమంలో సుమారు 9 ఏళ్ల నుంచి పనిచేసి నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాల అభివృద్ధికి కారణమైన సుమారు 1840 మంది గ్రామ సమన్వయకర్తలకు న్యాయం చేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తల యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
👉 మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్ కుమారుడు!
▪️మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ల ర్యాగింగ్
▪️జూనియర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
▪️బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు..▪️ఏడాదిన్నర పాటు సస్పెన్షన్.. రూ. 25 వేల జరిమానా విధింపు
రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాసంస్థ మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ ఘటనలో సస్పెండ్ అయిన 13 మందిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు తెలిసింది. తిరుపతికి చెందిన ఓ విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. గత నెల 22న హాస్టల్‌లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కొందరు సీనియర్లు అతడిని అడ్డగించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. వారి వేధింపులు శ్రుతిమించడంతో మనోవేదనకు గురైన విద్యార్థి బ్లేడుతో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన తోటి విద్యార్థులు విషయాన్ని వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.యాజమాన్యం తక్షణ చర్యలు
ఘటన జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 23న ఎయిమ్స్ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరుతూ మెయిల్ రావడంతో యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఎయిమ్స్‌లోని ర్యాగింగ్ నిరోధక కమిటీ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో 15 మంది ప్రమేయం ఉన్నట్టు తేలడంతో జూన్ 24న వారందరినీ సస్పెండ్ చేశారు. అనంతరం పూర్తిస్థాయి విచారణ జరిపి, 13 మంది విద్యార్థుల పాత్ర మాత్రమే ఉందని నిర్ధారించారు. మానసికంగా కుంగిపోయిన బాధితుడిని తల్లిదండ్రులు తమ స్వస్థలానికి తీసుకెళ్లినట్టు సమాచారం.
శిక్షల వివరాలు ఇలా..
విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో ముగ్గురు సీనియర్లను ఏడాదిన్నర పాటు (3 సెమిస్టర్లు) సస్పెండ్ చేసి, ఒక్కొక్కరికీ రూ. 25 వేల జరిమానా విధించారు. మరో ఆరుగురిని ఏడాది కాలం (2 సెమిస్టర్లు), మిగిలిన నలుగురిని ఆరు నెలల పాటు (ఒక సెమిస్టర్) సస్పెండ్ చేశారు. వీరందరికీ రూ. 25 వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు, హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు.
పోలీసు ఫిర్యాదుపై భిన్న కథనాలు
ఈ ఘటనపై జూన్ 24నే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని మంగళగిరి రూరల్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం మంగళవారం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో, పోలీసులకు ఫిర్యాదు విషయంలో ఎయిమ్స్, పోలీసుల మధ్య భిన్న కథనాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.
👉 సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు..
పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఫైర్ ..
కమిషనర్లు నెలకోసారైనా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి …చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే..ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్‌కుమార్ మండిపాటు
హైదరాబాద్: సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్‌స్టేషన్లు మారాయని.. సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా వాటిని మార్చారని పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా మండిపడింది. సివిల్ వివాదాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవి ఇతరులకు తెలిసేలా నెలకోసారి సమావేశాలు నిర్వహించి చెప్పాలని ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లను ఆదేశించింది.
*_ఇదీ నేపథ్యం.._*
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగోల్ బండ్లగూడలోని తన ఇంటి విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని.. స్టేషన్‌కు పిలిపించి నకిలీ కేసులు సృష్టించారని.. రూ. 55 లక్షలు చెల్లించి ఇంటిపై ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పి. సుదర్శనం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 వరకు స్టేషన్‌లో ఉంచి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించుకోకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారని పిటిషన్ పేర్కొన్నారు.
సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని.. దీనిపై పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు. గత విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకావాలని రాచకొండ సీపీ జి.సు«దీర్‌బాబు, నాగోల్ సీఐని ఆదేశించడంతో మంగళవారం సీపీ ఆన్‌లైన్‌లో, సీఐ నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మరోసారి విచారణ చేపట్టారు.
*సీపీకి కోర్టు సూచనలు_*
ఈ సందర్భంగా సీపీకి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. ఇకపై సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చకుండా నెలవారీగా సమావేశం నిర్వహించాలని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సందేశం ఇవ్వాలని సూచించారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నా.. ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా పోలీసుల జోక్యంతో పిటిషన్లు హైకోర్టుకు వస్తున్నాయన్నారు. మూడు రోజుల క్రితం ఓ పోలీసు నడిరోడ్డుపై ఒకరిని కొట్టడం చూశానని.. కానీ ప్రొటోకాల్ కారణంగా తాను కారులోంచి కిందకు దిగలేకపోయానని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వ్యక్తులను కొట్టే అధికారం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి స్పష్టం చేశారు.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించి న్యాయస్థానాల ఆదేశాలను పోలీసుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)లో చేర్చడంతోపాటు ఎస్‌వోపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని డీజీపీకి సూచించారు. దీంతో న్యాయస్థానం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని సుధీర్‌బాబు చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 19న తనను నిర్బంధించారని పిటిషనర్ చెబుతున్నందున.. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీని కోర్టుకు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. అప్పుడే పిటిషనర్‌ను రోజంతా స్టేషన్‌లో ఉంచారా? లేదా? అనేది తేటతెల్లమవుతుందన్నారు. సీసీ ఫుటేజీ సమర్పణపై వివరాలు తెలుసుకొని చెప్పేందుకు ఒకరోజు సమయం కావాలన్న జీపీ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చుతూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.
👉ఏపీలో సిబిఐ అధికారుల తనిఖీలు ..
శ్రీ సత్యసాయి జిల్లా
▪️కదిరిలో సిబిఐ అధికారుల తనిఖీలు.
▪️కదిరిలో వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బత్తల హరిప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్న సిబిఐ అధికారులు.
▪️మెడికల్ కాలేజ్ సీట్ల వ్యవహారంలో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
▪️ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో అవకతవకలకు పాల్పడ్డారని సిబిఐ తనిఖీలు.
👉భలే భలే .తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు.. లచ్చలు లచ్చలు పోశాడు.. సీన్ కట్ చేస్తే.!*
తక్కువ ధరకు బంగారు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన రాజేంద్రప్రసాద్‌కు బంగారు ఇప్పిస్తామని 7 కోట్ల 32 లక్షల రూపాయలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన పోతురాజు రతన్ కుమార్, జస్వంత్, శాంతి పవన్ కుమార్, కట్ట శ్రీకాంత్‌లు మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.
నిందితులు నకిలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్రప్రసాద్ తనకు బంగారు వద్దని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. కర్నూలుకు రావాలని నిందితులు తెలిపారు. కర్నూలులోని ఓ లాడ్జ్‌లో బాధితుడిపై దాడి చేసి మరో 50 వేల రూపాయలు తీసుకున్నారు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్‌గా గుర్తించారు.
ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఈ ముఠా సభ్యులు నకిలీ బంగారు వ్యాపారంతో పాటు ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నకిలీ పోలీసులుగా వచ్చి బాధితులను అరెస్టు చేస్తున్నట్లు హడావుడి చేస్తారని.. దీంతో బాధితులు భయంతో తీసుకున్న నకిలీ బంగారు బిస్కెట్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేవారని డీఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి 6 లక్షల 40 వేల రూపాయలు, నాలుగు కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు
👉ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!*
*ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు…*
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులనూ హడలెత్తిస్తున్నాయి.
ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగివేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టంది. డీజీ స్థాయి అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది.
వెయిటింగ్‌లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవి శంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.
👉టీడీపీ సిగ్గు తీసిన బీజేపీ ఎమ్మెల్యే😱😱😱
తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలు పుట్టిస్తున్నాయి.
బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా విశాఖకు చెందిన నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉంటున్నారు. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు, అది స్వపక్షమా విపక్షమా అన్నది కూడా చూసుకోరు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉంటూ చంద్రబాబుని పొగిడిన ఘనత ఆయనదే. ఇక ఇపుడు కూటమిలో ఉంటూ పెద్దన్నగా ఉంటున్న టీడీపీని నిలదీస్తున్న గొప్పతనమూ ఆయనదే.
*తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలు పుట్టిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కూటమికి అధికారం బీజేపీ పుణ్యమే అని కుండబద్దలు కొట్టారు రాజు గారు. ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా పీవీఎన్ మాధవ్ ఎంపికైన తరువాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమిలో మూడు పార్టీలకు సమాన అవకాశాలు రావాలని కొత్త పాయింట్ ని లేవనెత్తారు.
కూటమిలో బీజేపీ లేకపోతే ఏపీలో అసలు టీడీపీకి అధికారం వచ్చేది కాదు అని రాజు గారు అసలు గుట్టు కూడా చెప్పేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతోనే అన్ని విధాలుగా కలసి వచ్చింది అన్నది ఆయన మాటల ద్వారా వ్యక్తం అయింది. ఇక పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఎనభై శాతం తీసుకుంటోందని, జనసేనకు 15 శాతం పోతే బీజేపీకి అయిదు శాతం ఇస్తున్నారు అని తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారు.
ఇదెక్కడి అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అయిదు శాతం పదవుల కోసమా కూటమి కట్టింది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కూటమిలో సమన్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కోసం కూటమి కోసం త్యాగాలు చేసిన పార్టీ క్యాడర్ అయితే ఇక ఊరుకోరని కూడా ఆయన స్పష్టం చేశారు. వారికి ఎగనామం పెట్టడం అసలు కుదరదని కూడా ఆయన అన్నారు.
*ఇక విష్ణు కుమార్ లేవనెత్తిన ఈ 80 శాతం 15 శాతం 5 శాతం లెక్కలు చూస్తే కనుక ఏపీ కేబినెట్ లో 20 మంది మంత్రులు టీడీపీకి ఉన్నారు, అలాగే 15 శాతంతో మూడు మంత్రి పదవులు జనసేనకు దక్కాయి. అయిదు శాతంతో ఒకే ఒక్క పదవి బీజేపీకి ఇచ్చారు. దాని మీద గతంలోనూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
2014లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ ఈసారి ఎనిమిది మంది ఉంటే ఒక్కరికే మంత్రిగా చాన్స్ ఇచ్చారు, ఇదేమి లెక్క అని కూడా అన్నారు. రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కూడా ఉన్న విష్ణు కుమార్ రాజు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే కూటమిలో టీడీపీ జనసేనలకే ప్రాధాన్యత దక్కుతోంది. బీజేపీకి ఒకటీ అరా పదవులే ఇస్తున్నారు.
దీని మీద బీజేపీలో చాలా మంది కూడా మధనపడుతున్నారు. గతంలో పురంధేశ్వరి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్ళారు అయితే ఆమె అంతా అధినాయకత్వం చేతులలోనే అని తప్పించుకున్నారు అని ప్రచారం సాగింది. ఇపుడు ఎటూ ఆమె లేరు, మాధవ్ కి చార్జి ఇచ్చారు కాబట్టి ఆయనను ముందు పెట్టి తమకు ఎక్కువ పదవులు దక్కించుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారు.
వారందరికీ రాజు గారు అన్న మాటలు అయితే వినసొంపుగా ఉన్నారు. వారు ఆయనకు మద్దతుగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే టీడీపీ లేదు అన్న రాజు గారి మాటలు మాత్రం ములుకులుగా టీడీపీకి గుచ్చుకుంటున్నాయని అంటున్నారు.
రాజు గారు అసలు గుట్టుని నర్మగర్భంగా చెప్పేశారు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఎంత బలం ఉందని కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతే 2024 ఎన్నికల్లో అత్యంత కీలకం అయింది అన్నది ఆయన మాటల అంతరార్ధం అని అంటున్నారు. మార్చి లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచే ఏపీలో మొత్తం వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వ పెద్దల మాట వినడం మానేసి కూటమి వైపు తిరిగాయి అంటే దాని వెనక ఉన్నది ఎవరు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అంటే బీజేపీ మద్దతు ఎంతటి కీలకమో ఆయన స్పష్టంగా చెప్పదలచుకున్నారు అని అర్ధం అవుతోంది అంటున్నారు.


