*వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో భవనం పై నుంచి దూకిన విద్యార్థిని 😱😱😱 – ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన… వికారాబాద్ కొత్తగాడి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఈ నెల 24న పదో తరగతి విద్యార్థిని తబిత భవనం మొదటి అంతస్తు నుంచి దూకిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.ఈ సంఘటనను హాస్టల్ సిబ్బంది గుట్టుగా ఉంచి, ఎవరికి తెలియకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారని తెలుస్తోంది. పైగా, ఎవరికైనా చెప్పితే పరీక్షలు రాయనివ్వరని ఉపాధ్యాయులు బెదిరించినట్టు సమాచారం.ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్రవంతి వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు భవనం పై నుంచి దూకిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని, సముద్రంలోకి వెళ్లే నీటినే కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ఉండేవారితోపాటు తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి జలాలను బనకచర్లకు తీసుకెళ్లడం వల్ల ఎవరికీ నష్టం జరగదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటినే తరలిస్తున్నాం. దీనిని కూడా ఓ పార్టీ రాజకీయం చేస్తోంది. ఒకరు మాట్లాడితే తాము వెనుకబడి పోతామని మరికొందరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి. తెలంగాణలోని కరువు ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించుకోవచ్చు. నదుల అనుసంధానం జరిగితే సముద్రంలోకి వెళ్లే వృథాజలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు. 
👉 వైసీపీ ప్రభుత్వంలో మద్యంఅమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రూ.3,113 కోట్లు దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో చెప్పారు. ఐఎఫ్ఎంల ద్వారా రూ.2,861 కోట్లు, బీర్లు మీద 250 కోట్లు దోచుకున్నట్టు ప్రాఽథమిక సమాచారం ఉందన్నారు. అసెంబ్లీలో మంగళవారం సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలో మద్యం తయారీ ఆర్డర్లను తమకు నచ్చిన కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ‘కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి కేవలం ఏడు కంపెనీలకే సరఫరా చేశారు. దాదాపు 63 శాతం పైగా అర్డర్లు కొన్ని కంపెనీలకే కట్టబెట్టారు. కేసుకు ఇంతని వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మద్యం అక్రమాలన్నింటిపై సీబీసీఐడీ విచారణ జరుగుతోంది. సిట్‌ను ఏర్పాటు చేసినరోజే తాడేపల్లి ప్యాలెస్‌లో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. ఈ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదు’ అని మంత్రి హెచ్చరించారు. ఎక్సైజ్‌లో జరిగిన అవినీతిని వెలికితీయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కోరారు.
👉 వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చెప్పారు. విశాఖలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…జగన్ అసెంబ్లీకి వెళ్లాలని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని దేవుడిని కోరానన్నారు. రెడ్‌బుక్ ప్రకారం చూసుకుంటే త్వరలో కొడాలి నాని, రోజాలను అరెస్టు చేస్తారన్నారు. బూతులు తిట్టిన వారిపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారన్నారు. జగన్‌ను కూడా అరెస్టు చేసి లోపల వేసే అవకాశం ఉందన్నారు.
👉 రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఈశ్వరరావు, పార్థసారథి, సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తొలుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 50లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు కోటి 42 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ లెక్కన 8 లక్షల కుటుంబాలు మాత్రమే మధ్య, పైతరగతి వాళ్లు అన్న విషయం తెలుస్తోందన్నారు. తెల్ల రేషన్ కార్డులపై సర్వే చేసి, అర్హులైనవారికే కార్డులు ఇవ్వాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. మంత్రి మనోహర్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 91 శాతం మంది ప్రజలకు రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ నిర్వహిస్తున్నందున కొత్త కార్డుల పంపిణీ, ఉన్న కార్డుల విభజన చేయడం లేదన్నారు.
👉జనసేన మీద టీడీపీకి మండుతోందా ?*
రాజకీయాలు అంటేనే అవకాశాలను అందిపుచ్చుకోవడం. ఒక పార్టీకి మరో పార్టీ ఎన్నికల సమయంలో తప్ప ఎపుడూ అంత మితృత్వం ఉండదు, ఆ విధంగా చూస్తే కనుక కూటమి కట్టిన పార్టీలలోనూ విభేదాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు, అది అత్యంత సహజం కూడా. పాలిటిక్స్ అంటే చాన్స్ కోసం రేసింగ్. ఆ సమయలో ఎవరూ ఫ్రెండ్ షిప్ కోసం త్యాగాలు చేసే సీన్ అయితే ఉండదు.ఇదంతా ఎందుకు అంటే టీడీపీ జనసేన ఈ రెండూ మిత్ర పక్షాలు కదా మరి ఈ రెండు పార్టీల మధ్య బంధాలు ఎలా ఉన్నాయన్న ఆలోచనలు రావడమే. కూటమిగా మూడు పార్టీలు ఏర్పడి తొమ్మిది నెలలుగా అధికారాన్ని అందుకుంటున్నాయి. అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా ఆయా పార్టీలు వైసీపీ నుంచి నేతలను చేర్చుకునే పనిలో పడ్డాయి.ఈ విషయంలో మొదట్లో టీడీపీ జోరు చూపించినా ఇపుడు జనసేన దూకుడు చేస్తోంది. ఇక చూస్తే కనుక కూటమిలో ఎవరిని అయినా చేర్చుకోవాలి అనుకుంటే కనీసం చర్చ జరగాలి అని అంటున్నారు. అయితే అలాంటి చర్చలేమీ లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. జనసేన ఆ విధంగా వైసీపీ అసంతృప్తులను చేర్చుకుంటోంది. తాను రానున్న రోజులలో సొంతంగా ఎదగాలని జనసేన తాపత్రయపడుతోంది. ఈ విషయం పెద్దన్నగా ఉన్న పార్టీ టీడీపీ పసిగట్టకుండా ఉంటుందా. అందుకే టీడీపీ జనసేన రాజకీయ కార్యకలాపాలు జాగ్రత్తగా గమనిస్తోంది. ఇక జనసేన అధినాయకత్వం పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తోంది. జనసేనకు 2024 ఎన్నికల్లో కేవలం 6.5 ఓటు శాతం మాత్రమే వచ్చింది. దాంతో మరింతగా బలపడేందుకు ప్రతీ నియోజకవర్గంలో బలమైన నేతలను చేర్చుకునేందుకు రెడీ అవుతోంది. ఒకటి రెండు సార్లు గెలిచిన వారు ఆయా నియోజకవర్గాలలో కనీసంగా 20 శాతం ఓటు షేర్ ని సొంతంగా కలిగి ఉంటారని భావిస్తూ అలాంటి వైసీపీ నేతలనే జనసేనలోకి చర్చుకోవడానికి చూస్తోంది అని అంటున్నారు.ఈ విధంగా ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం ఓటు షేర్ తక్కువ కాకుండా ఉన్న బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన పూర్తిగా ప్రిపేర్ అవుతోంది. ఆనాటి ఎన్నికల్లో కనుక తన ఓట్లూ సీట్లూ గణనీయంగా పెంచుకుంటే సీఎం సీటుని షేరింగ్ లో భాగంగా డిమాండ్ చేయవచ్చు అన్నది జనసేన ఆలోచనగా ఉందని చెబుతున్నారు.మహారాష్ట్రలో మాదిరిగా కూటమి కట్టి ఆయా పార్టీల బలాబలాలను బట్టి సీఎం సీటు షేరింగ్ తో అధికారం అనుకుంటున్నారు అని జనసేన భావిస్తోంది. ఆ తరహా రాజకీయాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తోంది అంటున్నారు.ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఏకంగా 20 శాతం ఓటు షేర్ ని ఏపీలో జనసేన సాధించాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం టార్గెట్ గా ఉందని అంటున్నారు. ఆ విధంగా చేస్తే కనుక కచ్చితంగా తమ ఓటు షేర్ చూసి అయినా టీడీపీ కాళ్ళ బేరానికి వస్తుందని అపుడు సీఎం షేర్ అన్నది ఒక డిమాండ్ గా పెట్టినా ఓకే చేసేందుకు నూరు శాతం అవకాశాలు ఉంటాయని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు.అంతే తప్ప తాము చిన్న పార్టీగా ఉంటూ చంద్రబాబు వద్ద ప్రాపకం కోసం ఎన్నాళ్ళు చేసినా ఇబ్బందిగానే ఉంటుందని జనసేన తలపోస్తోంది. మొత్తానికి పక్కా రాజకీయ వ్యూహంతోనే ఈ చేరికలను జనసేన ప్రోత్సహిస్తోందని అంటున్నారు.ఇక చూస్తే కనుక సామాజిక వర్గ సమీకరణలను జనసేన కాచి వడపోస్తోంది. కోస్తా జిల్లాలలో కాపుల సంఖ్య అధికంగా ఉంది. వారు అనేక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉన్నారు. దాంతో జనసేన గుంటూరు నుంచి ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం వరకూ ఉన్న కాపులను పోలరైజ్ చేసి జనసేన వైపుగా నడిపిస్తఒంది. ఇలా చేయడం వల్ల తాము కీలకమైన పార్టీగా ఏపీలో ఎదుగుతామని లెక్కలేస్తోంది.
అదే సమయంలో గ్రేటర్ రాయలసీమను కూడా పవన్ కళ్యాణ్ ఒక వైపు చూస్తూనే గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కాపులు బలిజలుగా ఉన్నారు. అయితే వారు రాజకీయంగా అంత చైతన్యవంతంగా లేరు. దాంతో వారిని జనసేన వైపుగా ఆకట్టుకుంటే అక్కడ కూడా జనసేన బలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదన్నది పవన్ మార్క్ పొలిటికల్ థియరీగా ఉంది అంటున్నారు.మొత్తం మీద చూస్తే పవన్ రాజకీయం చాలా దూరదృష్టితోనే ఉంది. ఆయన మెల్లగా ఏపీ రాజకీయాల్లో జనసేనను థర్డ్ ఫోర్స్ గా బలంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఆయన టీడీపీతో పొత్తులో ఉంటూ వైసీపీని దెబ్బతీయడం ద్వారా ఆ ప్లేస్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అంతవరకూ పొత్తులు ఉండాలని భావిస్తున్నారు.అయితే టీడీపీకి జనసేన బలపడడం ఒక విధంగా ఇబ్బందికరమే అని అంటున్నారు. రెండు పార్టీల ఓటు బ్యాంక్ దాదాపుగా ఒక్కటే కావడంతో వైసీపీని బలహీనం చేసినా ఆ ప్లేస్ లో జనసేన ప్రత్యర్థిగా బలంగా మారడం టీడీపీ పెద్దలకు అంతగా ఇష్టం ఉండదనే అంటున్నారు. మొత్తం మీద జనసేన చేస్తున్న ఈ చాపకింద నీరు లాంటి పార్టీ బలోపేతం వ్యవహారం టీడీపీ వ్యూహాలను దాటి ఎంతవరకూ ముందుకు సాగుతుంది అన్నదే చూడాల్సి ఉంది.
👉*కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాగబాబు!*
*పవన్ కల్యాణ్ అభీష్టం మేరకే* జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించే అవకాశముంది. పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండే లాంటి కార్పొరేషన్‌కు ఆయన పేరు పరిశీలించే అవకాశముంది*
👉విజయవాడ-విశాఖ మెట్రోరైల్ భూసేకరణకు గ్రీన్సిగ్నల్*
ఏపీలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి ఫేజ్-1కు భూసేకరణ అభ్యర్థన దాఖలు చేసే అధికారాన్ని రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మెట్రో రైల్కు సంబంధించి డీపీఆర్, మొదటి దశ ప్రణాళికలకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతించగా.. తాజాగా ఫేజ్-1కు భూసేకరణ చేపట్టాలని విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
👉22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలు, వైసీపీ ప్రభుత్వ రీసర్వే పాపాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది : మాజీమంత్రి ప్రత్తిపాటి.*
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిషేధిత జాబితా భూముల రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
గత ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ప్రహాసనంగా మార్చి, రైతులకు తీవ్ర అన్యాయం చేసి, సొంత పార్టీవారికి మేలుచేసిందన్న ప్రత్తిపాటి… దేవాదాయ శాఖ తప్పిదంతో దాదాపు 12 లక్షల ఎకరాల భూములు 22ఏ (1C) జాబితాలో నమోదయ్యాయి. : పుల్లారావు… 2019లో టీడీపీ ప్రభుత్వం 22ఏ భూముల సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో దాన్ని చట్టంగా మార్చకుండా, నిబంధనలకు విరుద్ధంగా రీసర్వే చేపట్టింది ..గత ప్రభుత్వం భూరక్ష పేరుతో చేపట్టిన, భూముల రీసర్వ ప్రక్రియ మొత్తం ఒక ఫార్స్ గా మారిందని, అధికారపార్టీ నాయకులు దాన్ని దుర్వినియోగం చేశారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… సెంటు భూమి ఉన్నవారిని కూడా గత ప్రభుత్వం తన చేతగానితంతో తీవ్ర గందరగోళానికి గురిచేసిందన్నారు. 6,688 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపట్టిన గత ప్రభుత్వ నిర్వాకంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు గురయ్యారన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని, సరిహద్దులకు సంబంధించి భూ హక్కుదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గత పాలకులు పరిగణనలోకి తీసుకోలేదని ప్రత్తిపాటి చెప్పారు. ఒక భూమిని రీసర్వే చేసేటప్పుడు హద్దుదారులకు నోటిసులు ఇస్తారని, కానీ గత ప్రభుత్వం అలాంటి నిబంధనలు పాటించలేదన్నారు. కేవలం తమ పార్టీ నాయకులు, సానుభూతిపరులకు మేలుచేసేలా రీసర్వే చేసిందన్నారు. తమ సమస్యలపై ఫిర్యాదులు.. అభ్యంతరాలు తెలియచేయడానికి, వాటి పరిష్కారానికి కూడా వైసీపీప్రభుత్వం తగిన వ్యవధి కూడా ఇవ్వలేదన్నారు. 60 రోజులు సమయం ఇవ్వాల్సి ఉండగా, 20రోజులకే కుదించి రైతుల అభిప్రాయాలను పెడచెవిన పెట్టిందన్నారు. కూటమిప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలపై గ్రామసభలు నిర్వహించగా, ప్రజల నుంచి లక్షా 80వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో, ఎంత అడ్డగోలుగా రీసర్వే చేపట్టిందో చెప్పడానికి వచ్చిన అర్జీలే నిదర్శనమన్నారు. కూటమిప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ పద్ధతిప్రకారం, పారదర్శకంగా జరగుతోందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, రాజకీయ ప్రాబల్యానికి తావులేకుండా రికార్డ్స్ ప్రకారం సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని, రెవెన్యూమంత్రిని కోరుతున్నానన్నారు.
*22ఏ (1C) భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రజలకు తెలియాలి…*
22ఏ (1C) జాబితాపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో,భూ హక్కుదారుల్లో తీవ్ర ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ అంశం గురించి 2019లో అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లానని, దానిపై అప్పట్లో ఒక ఆర్డినెన్స్ కూడా చేయడం జరిగిందని, అంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పుల్లారావు తెలిపారు. పాదయాత్ర సమయంలో జగన్ 22ఏ పై ఎన్ని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమాయక రైతుల్ని మోసగించాడని పుల్లారావు చెప్పారు. టీడీపీప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై గత ప్రభుత్వం చట్టం చేయలేకపోయిందన్నారు. దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలన్నారు. దేవాదాయ శాఖ అధికారుల తప్పిదం (ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్) వల్ల దాదాపు 12 లక్షల ఎకరాల భూములు 22ఏ (1C) జాబితాలో నమోదయ్యాయన్నారు. దాంతో ఆ భూములకు బ్యాంకుల రుణాలు లభించక, రిజిస్ట్రేషన్లు జరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలా ప్రాంతాల్లో ఆ భూముల్లో ఇళ్లు కూడా వచ్చాయన్నారు. రాష్ట్రమంతా ఈ సమస్య పరిష్కారానికి ఎదురుచూస్తోందని మాజీమంత్రి తెలిపారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నామో, ఏ విదమైన చర్యలు తీసుకోబోతున్నామో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని గౌరవమంత్రి ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియడం అందరికీ మంచిదని పుల్లారావు అభిప్రాయపడ్డారు. మాజీమంత్రి ప్రత్తిపాటి లేవనెత్తిన ప్రశ్నకు కొనసాగింపుగా టీడీపీ ఎమ్మెల్యేలు కూనరవికుమార్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోనెల విజయ చంద్ర కూడా 22ఏ భూముల జాబితా, రీసర్వే సమస్యలను సభలో ప్రస్తావించారు.
👉15 కిలోల బంగారం స్మగ్లింగ్.. నటి రాన్యా రావు అరెస్ట్ … దుబాయ్ నుంచి రాన్యా తీసుకొచ్చిన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ).. ఇటీవల తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో రాన్యాపై నిఘా ..గత 15 రోజుల్లో రాన్యా 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చి, గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో తీసుకొచ్చేవారని నిర్ధారించిన డీఆర్ఐ అధికారులు
👉ఏలూరు జిల్లా…జంగారెడ్డిగూడెంలో ఒంటరి వృద్ధురాలిపై ముగ్గురు ఆగంతకులు దాడి…ఇల్లు అద్దెకు కావాలని ఇంట్లోకి చొరబడిన ముగ్గురు యువకులు….వృద్ధురాలపై దాడి చేసి మెడలో గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారైన వైనం…దాడి సమయంలో వృద్దురాలు ఫాతిమా మున్ని చేతికి గాయం…
👉 *తప్పు చేసినవారిని వదిలేది లేదు**రెడ్బుక్ దాని పని అది చేస్తుంది: మంత్రి లోకేశ్*
*మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ*…పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు*…*గుంటూరు నుంచి అభి మీడియా ప్రత్యేక ప్రతినిధి : రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతోందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాతూ ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతీ ఎన్నికలో విజయం కూటమిదేనని మంత్రి ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కనీవిని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత మనదేనని వెల్లడించారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షహోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగుళూరు వెళ్లిపోతాడని దుయ్యబట్టారు.*
👉వైఎస్సార్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్గా మారాయని మంత్రి లోకేశ్ అన్నారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్సార్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని లోకేశ్ గుర్తు చేశారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొనియడారు. పింఛన్ పెంచినా, అన్న క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు. యువత గెలిపించిన గెలుపు ఇది అని స్పష్టం చేశారు. మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.*
👉నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం!
ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది.
👉 అన్నమయ్య జిల్లా.. మతాలను అడ్డం పెట్టుకోని సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతామంటే విడిచిపేట్టే ప్రసక్తే లేదు. – అన్నమయ్య జిల్లా యస్పీ విద్యాసాగర్ నాయుడు.
వీరభద్ర స్వామి పారువేట సందర్భంగా హిందూ సంఘాలు చేరి అనవసర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా చేశారు. ముస్లింలు కూడా జంక్షన్ వద్ద ఊరేగింపును అడ్డుకోవడంతోపాటు పోలీసులు మమ్మల్ని మోసం చేశారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఇరు వర్గాల్లో అకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారు. దాదాపు 1000 మంది చెప్పులు విసరడం, రాళ్లు రువ్వడం చేశారు. రెచ్చగొట్టిన వారిపైన ఇరు వర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. డ్రోన్ కెమెరాలతో ఆకతాయిలను గుర్తించాం. లాఠీచార్జిలో పోలీసులతో సహా చాలామందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పుకార్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసిమెలిసి వీరభద్ర స్వామి ఉత్సవాలు, ముస్లింల పండుగలు జరుపుకుంటూ వచ్చారు. ఈమధ్య హిందూ, ముస్లిం మత సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాటాల పేరుతో తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వారి వల్ల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది. ఇటువంటి వారిపై పిడి యాక్టు లు నమోదు చేస్తాం, జిల్లా బహిష్కరణ చేస్తాం.

